నా గురించి చిన్నమాట

గౌరవ చదువరులకు,
పేరు ః సంజయ్ కుమార్ పెంట
నాన్నగారు ః కీ.శే. శ్రీ గణపతిరావు పెంట
అమ్మగారు ః కీ.శే. శ్రీమతి లీలవేణి
వృత్తి ః ఉపాధ్యాయ వృత్తి
నాగురించి ః
నేను విజయనగరం జిల్లాలో గల మారుమూల ప్రాంతమైన కవిరిపల్లి అనే గ్రామంలో జన్మించి ప్రభుత్వపాఠశాలలో విద్యాభ్యాసం గావించి, తదుపరి వ్యవసాయవృత్తిని స్వీకరించి వ్యవసాయంలో గల అనుభవైక నైవేద్యాన్ని స్వీకరించి ఇంక నావల్ల కాదని ఉపాధ్యాయవృత్తిని స్వీకరించి 17 సంవత్సరాలుగా విద్యార్థులకు మార్గదర్శిగా వ్యవహరిస్తూ నా జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను.
ప్రారంభం ః
నా యీ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను, అవమానాలను, అభిమానులను, గోముఖవ్యాఘ్రరూపధారులను, దురభిమానులను, ఎందరినో ఎదుర్కొంటిని. అయినా వెరవక సరస్వతీ మాత అనుగ్రహంతో సంస్కృతం , తెలుగు భాషాభివృద్ధికి పాటుపడుతూ నా వంతు ప్రయత్నం నేను చేస్తూనే నా యీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను.
నేను గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు భాషకు సంబంధించి గాని, 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు గల పాఠ్యాంశాలకు సంబంధించి గాని ఎటువంటి సమాచారం సమృద్ధిగా లభించటం లేదన్నది గమనించాను. యూట్యూబ్ వేదికనందు చాలా మంది ఔత్సాహికులు చాలా విధాలుగా తెలుగు భాషాభివృద్ధికై తమవంతు ప్రయత్నం వారు చేస్తూనే ఉన్నారు. కాని ఒకే వేదికలో లభ్యమవటం అనేది చాలా దుర్లభంగా ఉంది. దానివలన అభ్యాసార్థులకు ఏ విషయాన్నైనా అన్వేషించాలంటే మృగ్యంగా మారింది. ఇవన్నీ గమనించాక తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాధినేతలు కూడా తెలుగు భాషకు ఇస్తున్న ప్రాధాన్యం రీత్యా నాకు కొత్త ఉత్సాహం చిగురించి, నాకున్న కొంత అంతర్జాల నైపుణ్యంతో భాషాభివృద్ధికి నావంతుగా ఏదో చేయాలనే సంకల్పంతో చేస్తున్న ప్రయత్నమే ఈ వేదిక.
అయితే ప్రస్థానంలో భాషాబోధనలో ఎక్కడో లోటు కనపడుతుంది అని నా అనుభవంతో తోటి ఉపాధ్యాయుల మనోవాక్ అభిప్రాయాలతో కాస్త ఏకీభవిస్తూ, తెలుగు – సంస్కృతేతర భాషలపై మక్కువ చూపిస్తూ కన్నతల్లి లాంటి భాషను మరచిపోయి తెలుగుభాషను వ్యంగ్యోక్తులకు మాత్రమే పనికి వచ్చే భాషగా, సంస్కృత భాష అసలు జీవితంలో పనికిరాదని, అసలు మానవ జీవితాలు దుర్భరం కావడానికి సంస్కృత భాషే అనే దురభిప్రాయానికి వచ్చేసి, సభలలో వక్తలకు, మధ్య మధ్యలో వాళ్ళ వాళ్ళ భాషా భేషజానికి మాత్రం కొన్ని పదాలు ఉపయోగించుకొనే ఒక మృతభాషలా తయారు చేస్తున్న ఈనాటి కొందరి వాక్చాతుర్యాలను చూశాక నా మనస్సు చలించి తెలుగు భాషలో గల పదజాల పటిష్ఠతను, తెలుగు మాధుర్యాన్ని, సంస్కృత భాష వైశిష్ట్యాన్ని గుర్తుచేయడానికి సాహసం చేస్తూ ఉన్నాను.
ఈనాటి విద్యార్థులకు అస్సలు తెలుగు మాట్లాడడం గాని, అక్షరాల ఉచ్చారణ గాని సరిగా రావటం లేదు. అలాగే లేఖనా దోషాలు విస్తృతంగా కానవస్తున్నాయి. తెలుగులో ఆలోచించే సృజనాత్మక శైలి పిల్లల్లో అంతరించిపోతున్నది. పై అంశాలన్ని ఈ వేదికనందు చర్చించడానికి పూనుకున్నాను.
ఈ వేదిక నందు అక్షరం దగ్గర నుండి వీడియో పాఠాల వరకు అన్ని పొందుపరుస్తున్నాను. అంతే గాకుండా నా శక్తి మేరకు ఆయా పాఠాల మెటీరియల్ ను కూడా పొందుపరచటానికి కృషిచేస్తాను.
ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తెలుగు, సంస్కృత భాషాభిమానులు ఈ వేదికను చక్కగా ఉపయోగించుకుని జ్ఞానాభివృద్ధిని పెంపొందిచుకుంటారని ఆశిస్తున్నాను.
గమనిక ః ఈ వేదిక నందు కేవలం పాఠ్యాంశాలకు సంబంధించిన అంశాలే కాకుండా చదువరులకు కలిగే సందేహాలు తీర్చే వేదికగా మార్చడానికి కూడా కృషి చేస్తూ కథలు, శతకాలు, వివిధ ప్రక్రియలు, వివిధ రకాల పద్యాలు, ఆశువులు, కవితలు భాషా విశేషాంశాలు ఇలా అనేక రకాలుగా ఈ వేదిక ఉపయోగపడనుంది.