ఆచార్య సంజయ్ వ్యాకరణం (సంధులు)

 సంధులు వాటి రకాలు

సంధుల విజ్ఞానం ప్రస్తావన

    “వాడు రామాలయానికి, వెంకటేశ్వరాలయానికి వెళ్ళి సాష్టాంగపడి నమస్కరించి వచ్చాడు. ప్రత్యహం వాడు ఇలా శివార్చనం, విష్ణ్వారాధనం చేస్తూనే ఉంటాడు.” ఇలా ఒక భక్తుని గురించి ప్రస్తావించాడొకడు. ఆ భక్తుని భక్తిని, దేవునిపట్ల ఉన్న నమ్మకాన్ని సూచిస్తూ ఏయేదేవుళ్ళను పూజిస్తున్నాడో ఎప్పుడెప్పుడు పూజిస్తున్నాడో కూడా చెప్పాడు.

    ఈ పైన చెప్పినవాటిలో “రామాలయం, వెంకటేశ్వరాలయం, సాష్టాంగ నమస్కరించు, 4 ప్రత్యహం, శివార్చనం, విష్ణ్వారాధనం’ – అనే పదాలు ఉపయోగింపబడ్డాయి. ఈ పదాలన్నింటిలోనూ రెండూ లేదా మూడేసి పదాలు వాడబడ్డాయి.

రామాలయం అనేదానిలో రామ, ఆలయం అని, (2)

వేంకటేశ్వరాలయం అనేదానిలో వేంకట, ఈశ్వర, ఆలయం అని, (3) 

సాష్టాంగ అనేదానిలో స, అష్ట, అంగ అని (3) 

నమస్కరించి అనేదానిలో నమః, కరించి అని (2)

ప్రత్యహం అనేదానిలో ప్రతి, అహం-అని, (2)

శివార్చనం అనేదానిలో శివ, అర్చనం అని (2) 

విష్ణ్వారాధనం అనేదానిలో విష్ణు, ఆరాధనం అని (‘2)

రెండు, లేదా మూడు పదాలు ఒకదానికొకటి కలిసిపోయాయి. అలా కలిసిపోయి ఒకే పదంగా మిగిలిపోయాయి. ఇలా కలవటంలో ఆ పదాలలో పదం మొదటిలో గాని, పదం చివరనగానీ ఉన్న కొన్ని అక్షరాలు దీర్ఘాలుగా మారటం లేదా వేరే అక్షరాలు రావటం, ఉన్న అక్షరాలు పోవటం ఇలా కొన్ని కొన్ని మార్పులు అన్నింటిలోనూ జరిగాయి. ఇలా పదాలు కలిసి పోయేటప్పుడు పదాల అక్షరాలలో వస్తున్న ఈ మార్పు ఏమిటి అని ప్రశ్నించు కుంటే చదువుకున్న వాళ్ళు చదువుకుంటున్న వాళ్ళూ కూడా చెప్పే సమాధానం ఒక్కటే. “ కు ఇక్కడ సంధి జరిగింది” – అని. –

ఇది ‘సంధి’ అంటే మనం మామూలుగా చెప్పుకునే విషయం. అయితే ఈ సంధి అనే దానికి సంస్కృత వ్యాకరణాలు, తెలుగు వ్యాకరణాలు వాటి వాటి మర్యాదలను అనుసరించి రకరకాల నిర్వచనాలను చెప్పుకున్నాయి. రకరకాల సంధులను చూపించాయి. ఏ భాషా మర్యాద దానిదిగా మారింది. ఇలా చెప్పుకున్న సంధుల్లో అనేక రకాలు ఉన్నప్పటికి, యె ‘అచ్ సంధి, హల్ సంధి’ – అని ముఖ్యంగా ఇద్దరూ రెండు విధానాలను చెప్పి అందులో బోలెడన్ని వివరించారు.

దాన్ని మనం ఏది చెప్పుకున్నా సంస్కృతాన్ని గురించి ముందు ప్రస్తావించుకొని అనుసరించో విడిగా ఉంటూనో ఉండే తెలుగు భాషకు సంబంధించిన వాటిని విడిగా చెప్పుకుంటాం. ఎందుకంటే మనం వాడే మాటల్లో సంస్కృత పదాలుఅంతగా కలిసిపోయాయి కనుక.ఇక సంస్కృతంలో ‘సంధి’ అంటే ఏమి చెప్పారో, అందులో ఉన్న అచ్, హల్ సంధుల్లో మనం మనకు ముఖ్యమయిన వాటిని మాత్రం తెలుసుకుంటాం.

సంస్కృత సంధులు

సంధి నిర్వచనం : (సంస్కృతానికి సంబంధించి)

“వర్ణానాం పదానాం వా సమాయోగః ; లో పాగమాదేశాది వర్ణ వీకారో వా సంధి: ఇతి ఉచ్యతే. సచ సంహితా విషయే బోధ్యః సంహితాతు క్వచిన్నిత్యా క్వచిద్వివక్షా.” “వర్ణాలుగాని, పదాలుగాని కలియుటయే సంది. లేదా – లోపము, ఆగమము, ఆదేశము-మొదలయినవాని వల్ల కలిగే వికారాన్ని, సంధి అనవచ్చు. ఆ సంధి కూడా ‘సంహిత’ ఉన్నప్పుడే జరుగుతుంది. సంహితకూడా ఒకోసారి నిత్యం, ఒకోసారి చెప్పేవాడి యిష్టం బట్టి ఉంటుంది.”

– అంటే సంస్కృతభాషలో సంధి జరగాలంటే వర్ణాల మధ్య సంహిత (దగ్గరితనంసామీప్యం) ఉన్నప్పుడే జరుగుతుందనేది స్పష్టం.

సంధి-పదానికి వ్యుత్పత్తి చెప్పుకుంటే – సంధీయతే అనేన ఇతి సంధి: రెండిం ఒక్కటిగా చేయునది – అని అర్థం.

సంధి అంటే → “సంధిర్నామ సంధానం, ద్వయోః ఏకత్వం” రెండు వస్తువులు ఒకటియగుట; (సంధానం కలయిక) అని చెబుతారు.

సంస్కృతంలో సంధి జరగాలంటే ‘సంహిత’ ఉండాలి. ఈ సంహితను గురించి సంస్కృత వ్యాకరణం ఏం చెప్తోందంటే –

“పరః సన్నికర్షః సంహితా. వర్ణానా మతిశయితః సన్నిధిః సంహితా సంజ్ఞః స్యాత్” – సన్ని కర్షకలిగి ఉండటం సంహిత. అక్షరాల మధ్య అర్థమాత్రా కాలిక వ్యవధానం కంటే ఎక్కువ వ్యవధానం లేకుండా ఉండే స్థితిని సంహిత అనవచ్చు. వ్యవధానం అంటే రెండింటిమధ్య ఇంకొకటి వేరేదేదీ లేకుండా ఉండటం.

సంహితైక పదే నిత్యా నిత్యాధాతూపసర్గయోః నిత్యా సమాసే; వాక్యేతు సావివక్షా మపేక్షతే.

ఒక పదంలోనూ, ధాతూపసర్గలకు సమాసములోను సంహిత నిత్యము. వాక్యము నందు మాట్లాడేవాని వివక్షను బట్టి సంహిత ఉంటుంది సంహిత ఉంటేనే సంధి జరుగు తుంది.

మనం ఏది చెప్పుకున్నా సంస్కృతాన్ని గురించి ముందు ప్రస్తావించుకొని దాన్ని అనుసరించో విడిగా ఉంటూనో ఉండే తెలుగు భాషకు సంబంధించిన వాటిని విడిగా చెప్పుకుంటాం. ఎందుకంటే మనం వాడే మాటల్లో సంస్కృత పదాలుఅంతగా కలిసిపోయాయి

ఇక సంస్కృతంలో ‘సంధి’ అంటే ఏమి చెప్పారో, అందులో ఉన్న అచ్, హల్ సంధుల్లో మనం మనకు ముఖ్యమయిన వాటిని మాత్రం తెలుసుకుంటాం. పదండి మరి ముందుకు

ఉదా: ఏక పదానికి         రామ + ఇన                = రామేణ

        ధాతూపసర్గ         ప్ర + ఏథతే                 = ప్రేధతే.            నిత్య సంహిత

        సమాసము           మధు + అరిః              = మధ్వరి:

        వాక్యమ్           :    రామస్య + అనుజః ఆగతః        వాక్యంలో సంధి జరగని రూపం

                                  రామస్యానుజః ఆగతః             వాక్యంలో సంహిత జరిగిన రూపం

  ఈ సంధులు సంస్కృతంలో స్థూలంగా చెప్పుకోవాలంటే ఆగమ సంధులు, ఆదేశ సంధులు, ఏకాదేశ సంధులు అని మూడు రకాలుగా ఉంటాయి.  

(1) ఆగమ సంధులు: ఆగమం అంటే ‘మిత్రవదాగమః”

అంటే సంధిజరుగుతున్నప్పుడు పూర్వ, పర వర్ణాల మధ్య ఉన్న అక్షరాలను వేటినీ తొలగించకుండా వాటిరెంటి మధ్యా మరొక అక్షరంవచ్చి చేరితే, అది ‘ఆగమం’ అయి, అలా ఆగమాలుగా వచ్చే అక్షరాలతో ఏర్పడే సంధులు

= ‘ఆగమసంధులు’ అవుతాయి 

సంస్కృతంలో ‘తుగాగమసంధి, ధుడాగమసంధి, జముడాగమ సంధులు ఇలాంటివి ఆగమ సంధులు.

తెలుగులో అయితే యడాగమంతో ప్రారంభమయి, పుగాగమం, టుగాగమం, నుగాగమం, దుగాగమం, రుగాగమం – అంటూ ఎన్నో ఉన్నాయి. “ఆగమ సంధులు. 

(2) ఆదేశ సంధులు : – ఆదేశం అంటే ‘శత్రువదాదేశః’

సంధి జరిగేటప్పుడు ఉన్న అక్షరాలను పోగొట్టి వేరే అక్షరాలు వాటిస్థానంలో రావటం ఆదేశం అనుకున్నప్పుడు,

అలా ఆదేశాలుగా వస్తున్న అక్షరాలతో సంధి జరిగితే అవి ఆదేశ సంధులు.

యణాదేశసంధి – అనునాసిక సంధి వంటివి సంస్కృత ఆదేశ సంధులు. పుంప్వాదేశ సంధి, పఙ్పవర్ణాదేశసంధి, గసడదవాదేశ సంధులు ఆదేశ సంధులుగా తెలుగులో చెప్పుకోవచ్చు.

పూర్వపర వర్ణముల రెంటి స్థానంలో ఒకటి మాత్రమే వస్తే ఏకాదేశం : సవర్ణదీర్ఘసంధి, గుణ సంధి, వృద్ధి సంధుల వంటివి సంస్కృత సంధులయితే ఉకార అకార ఇకార సంధుల్లాంటివి తెలుగు ఏకాదేశ సంధులు.

సంధులు – విభాగాలు .

సంస్కృతంలో సంధులు ఈ క్రింది విధంగా విభజించ బడ్డాయి : 

“సంధిః సామాన్యతః అచ్సంధిః (స్వర సంధిః) ప్రకృతి భావ సంధిః, హల్ సంధి: (వ్యంజన సంధిః) విసర్గ సంధిః, స్వాదిసంధిః చ ఇతి పంచథా’ –

సంధి సామాన్యంగా అయిదు విధాలు :

(1) అచ్ సంధి (స్వర సంధి)

(2) ప్రకృతి భావ సంధి

(3) హల్ సంధి (వ్యంజన సంధి)

(4) విసర్గ సంధి 

5) స్వాది సంధి

ఇందులో మనం ప్రకృతి భావసంధి, స్వాదిసంధి అనే రెంటినీ మినహాయించి, మిగిలి అచ్, హల్, విసర్గ సంధులు, అందులో భేదాలు, అవి ఏర్పడే విధానాలు తెలుసుకుంటాము అయితే, ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. సాధారణంగా ‘సంధి’ అన్నా! కనీసం రెండు పదాలుంటాయి. 

ఈ రెండు పదాల్లోనూ 

మొదటి పదాన్ని “పూర్వ పదం” అనీ అంటారు. 

రెండవ పదాన్ని “పరపదం” అనీ అంటారు.

ఆగమాలుగా వచ్చేవాటిని సంస్కృతంలో “టిత్తులని కిత్తులని” అంటారు. “అద్యంతౌటకితౌ” – అని వాళ్ళు ఒక నిర్ణయం చేసుకున్నారు.

టిత్తులు విధింపబడినదానికి పూర్వమందు (ఆద్యవయవం) కిత్తులు విధింపడిన దానికి పరమందు (అంతవయవం)గాను చేరతాయి అని దాని అర్థం. పూర్వపదం చివర వచ్చినా, పరపదం మొదట వచ్చి చేరినా ఆ టిత్తులు కిత్తులు రెండు పదాల మధ్యనే వచ్చి చేరినట్లు పైకి కనిపించినా వాటికి వారు వేరే నిర్ణయాలు తీసుకున్నారని సూక్ష్మంగా పరిశీలిస్తేగానీ తెలియదు. వాటి ప్రయోజనాలూ వేరే మరి.

స్వర సంధులు చెప్పుకునేటప్పుడు ఇవి అంతగా తెలియవు కాని, హల్సంధులు చెప్పుకునేటప్పుడు కనిపిస్తాయి.

తెలుగులో యట్ ఆగమంలోను, పుగాగమం, రుగాగమం టుగాగమం, నుగాగమం మొదలయిన వాటిలో ఈ టిత్తులు, కిత్లు కనిపిస్తాయి.

‘టితో’ అంటే టకారం ఇత్ సంజ్ఞగలది అని, కిత్ అంటే కకారం ఇత్ సంజ్ఞ గలది అని అర్ధం. ‘ఇత్సంజ్ఞ’ అనేది సంస్కృత వ్యాకరణంలో ఉంటుంది. దానివల్ల వారు ప్రత్యేక ప్రయోజనాన్ని పొందారు. ‘ఇత్’ అనేదిలోపించి, మామూలు హల్లు (పొల్లు హల్లు) మాత్రమే అక్కడ మిగలటం దాని ఫలితం.

A) అచ్ సంధి: 

అచ్చుల మధ్య జరిగే సంధికి ‘అచ్ సంధి’ అనిపేరు

(1) సవర్ణదీర్ఘ సంధి. 

(2) గుణ సంధి.

(3) వృద్ధి సంధి. 

(4) యణాదేశ సంధి. 

(5) వానాదేశ సంధి. 

(6) యాన్తాదేశ సంధి. 

(7) పూర్వరూప సంధి. 

(8) పరరూప సంధి.

(9) అవజ్ఞాదేశ సంధి.

. ఈ అచ్ సంధి 9 రకాలుగా ఉంది.

 ఈ సంస్కృత సంధుల సూత్ర నిర్మాణములు, వివరణములు బ్రహ్మశ్రీ ఉడాలి సుబ్బరామశాస్త్రిగారి (శబ్ద రత్నావళి:) విద్యార్థి వ్యాకరణం మరియు  లఘు సిద్ధాంత కౌముది అనే గ్రంథాల్ని ఆధారంగా చేసుకొని వివరించడం జరిగింది.

తదుపరి సంధుల వివరణ చూడండి.



About Author

aacharyasanjay1977@gmail.com

aacharyasanjay1977@gmail.com

Leave a Feedback

Join Now Join Now